భారత్‌ భాషా కీ జై!

భారతదేశం అంటేనే విభిన్న సంస్కృతులు, భిన్న భాషల మేళవింపు. రాష్ర్టానికో భాష, ఊరికో యాస, ప్రాంతానికో పండుగ, ఇంటికో సంప్రదాయం. అందుకే భారత్‌ గురించి తెలుసుకోవడం అంటే చాలామందికి ఆసక్తి. ఇక్కడి భాషలు నేర్చుకోవడం అంటే మరింత ఇష్టం. ఆ ఆసక్తిని కనిపెట్టి అందులో బిజినెస్‌ ఐడియాను గుర్తించారు హైదరాబాద్‌లోని ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ నుంచి ఎంబీఏ చేసిన అనీషా జ్యోతి. కెనడాలో ఏడేళ్లు ఉండి వచ్చారు జ్యోతి. తను బయటికి వెళ్లినప్పుడు అక్కడి జనంలో భారతీయ భాషలపట్ల ఉన్న అభిమానాన్ని గుర్తించారు. అందుకే చదువు పూర్తవగానే స్నేహితులు వత్సల శర్మ, పునీత్‌ సింగ్‌తో కలిసి ‘లాంగ్వేజ్‌ కర్రీ’ యాప్‌ను డెవలప్‌ చేశారు. దీని సాయంతో హిందీ, సంస్కృతంతో పాటు తమిళం, తెలుగు, కన్నడంలాంటి పది భాషలు నేర్చుకోవచ్చు.

ఒక పదం.. విభిన్న సందర్భాల్లో దాని వాడుక, పలికే యాస కూడా నేర్పుతారు. కేవలం అక్షరాల ద్వారానే భాషను నేర్పడం కాకుండా బొమ్మలతో పాఠాలు చెబుతారు. ముఖ్యంగా ఆ ప్రాంతపు పండుగలు, సంప్రదాయాలను పరిచయం చేస్తారు. అంతేకాదు, మనం ఎలా మాట్లాడుతున్నామో తెలుసుకునేందుకూ, ధైర్యంగా మాట్లాడగలిగేందుకూ సహకరించేలా ఆయా భాషలు మాట్లాడే స్థానికులతో ఫోన్‌ ద్వారా మాట్లాడిస్తారు కూడా. విదేశాల నుంచి వచ్చే టూరిస్టులు, విద్యార్థులు, చిన్నపిల్లలు, ఇక్కడి సంస్కృతి తెలుసుకోవాలనే కుతూహలం ఉన్న ఔత్సాహికులకు ఈ యాప్‌ చక్కగా ఉపయోగపడుతుంది. ఈ యాప్‌ను ఇప్పటిదాకా 170 దేశాలకు చెందిన పదిహేను లక్షల మంది డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. అందులో అత్యధికులు భారతీయులే.