దేశంలోనే మొట్టమొదటి "ఎలక్ట్రిక్ హైపర్-స్పోర్ట్స్ సూపర్ బైక్" రాబోతోంది.. టాప్ స్పీడ్ ఎంతంటే..?

To start receiving timely alerts, as shown below click on the Green “lock” icon next to the address bar

దేశంలోనే మొట్టమొదటి "ఎలక్ట్రిక్ హైపర్-స్పోర్ట్స్ సూపర్ బైక్" రాబోతోంది.. టాప్ స్పీడ్ ఎంతంటే..?

భారతదేశంలో విడుదలైన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలలో ఇప్పటి వరకూ లో-స్పీడ్ ఎలక్ట్రిక్ మోపెడ్లు, ఎలక్ట్రిక్ స్కూటర్లు, హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్లు, ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లు, ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ బైకులు మరియు ఎలక్ట్రిక్ క్రూజర్ మోటార్‌సైకిళ్లు కూడా మార్కెట్లోకి వచ్చాయి. అయితే, కేవలం మూడే సెకండ్లలో గంటకు గరిష్టంగా 0-100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకునే ఎలక్ట్రిక్ హైపర్-స్పోర్ట్స్ సూపర్ బైక్ (Electric Hyper-Sports Super Bike) ఇంకా రాలేదు. అలాంటి ఓ హై-పెర్ఫార్మెన్స్ ఇ-బైక్ ను తీసుకురాబోతోంది ట్రౌవ్ మోటార్ (Trouve Motor).

ఐఐటి ఢిల్లీకి చెందిన వ్యాపార సంస్థ ట్రౌవ్ మోటార్ (Trouve Motor), భారతదేశంలో ఓ అధునాతన ఎలక్ట్రిక్ హైపర్-స్పోర్ట్స్ సూపర్‌బైక్‌ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఈ సూపర్‌బైక్ గరిష్టంగా గంటకు 200 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీయగలదని, కేవలం మూడు సెకన్లలో 0-100 కెఎంపిహెచ్ వేగంతో వెళ్లగలదని కంపెనీ చెబుతోంది. ఈ మేరకు ట్రౌవ్ మోటార్ ఓ టీజర్ ను కూడా విడుదల చేసింది.

ఇంకా పేరు ఖరారు చేయని ట్రౌవ్ ఎలక్ట్రిక్ హైపర్ స్పోర్ట్స్ బైక్ లో 40 kW శక్తిని ఉత్పత్తి చేసే లిక్విడ్ కూల్డ్ ఏసి ఇండక్షన్ మోటార్ ఉంటుందని కంపెనీ పేర్కొంది. ఇందులో లేజర్ లైటింగ్ ప్యాకేజ్, అడ్వాన్స్‌డ్ ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే, 360 కెమెరా, టిఎఫ్‌టి టచ్ స్క్రీన్ డిస్‌ప్లే వంటి ఆధునిక టెక్ ఫీచర్లు మరెన్నో ఉండబోతున్నాయని కంపెనీ తెలిపింది. అయితే, ఇందులో ఉపయోగించబోయే బ్యాటరీ ప్యాక్ మరియు దాని రేంజ్ వంటి ఇతర విషయాలను మాత్రం కంపెనీ ఇంకా వెల్లడించలేదు.

అంతేకాకుండా, ఈ ట్రౌవ్ ఎలక్ట్రిక్ హైపర్ స్పోర్ట్స్ బైక్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ కనెక్టింగ్ టెక్నాలజీ, జిపిఎస్ నావిగేషన్, రియల్ టైమ్ వెహికల్ డయాగ్నస్టిక్ వంటి ఫీచర్లు కూడా ఉండనున్నాయి. అలాగే, ఇందులో డ్యూయల్-ఛానల్ ఏబిఎస్, సర్దుబాటు చేయగల సస్పెన్షన్‌ సెటప్ మరియు బ్రెంబో బ్రేక్‌లు వంటి హార్డ్‌వేర్‌ను కూడా పొందుతుంది మరియు ప్రపంచవ్యాప్తంగా ద్విచక్ర వాహనాల విభాగంలో మొదటగా కనిపించే అనేక పేటెంట్ టెక్నాలజీలను కూడా పొందుతుంది.

ట్రౌవ్ మోటార్ తమ మొదటి బైక్‌ ను మరికొద్ది రోజుల్లోనే అధికారికంగా ఆవిష్కరించనుంది మరియు దీని కోసం ప్రీ-బుకింగ్ లు ఈ ఏడాది ద్వితీయార్థం నుండి ప్రారంభం అవుతాయాని సమాచారం. భారత మార్కెట్ కోసం ట్రౌవ్ మోటార్ ప్లాన్ చేసిన ప్రోడక్ట్ లైనప్ లో క్లాసిక్, కేఫ్ రేసర్, నేక్డ్ స్ట్రీట్ బైక్, ఎండ్యూరో మరియు స్క్రాంబ్లర్‌ తో మరో ఐదు మోడళ్లు పైప్‌లైన్‌లో ఉన్నట్లు కంపెనీ పేర్కొంది. ట్రౌవ్ మోటార్ నుండి ఈ రాబోయే బైక్‌ లను అన్నింటినీ ఐఐటి ఢిల్లీ లోని ట్రూవ్ యొక్క ఆర్ అండ్ డి కేంద్రంలో మరియు బెంగళూరులోని ఫ్యాక్టరీలో డిజైన్ మరియు డెవలప్ చేయబడుతున్నాయి.

ఈ సందర్భంగా ట్రౌవ్ మోటార్ వ్యవస్థాపకుడు అరుణ్ సన్నీ మాట్లాడుతూ, తమ సరికొత్త సూపర్‌ బైక్‌ ను విడుదల చేయడానికి తాము సంతోషిస్తున్నామని. తమ ఉత్పత్తులు ఎలక్ట్రిక్ వాహనాల భవిష్యత్తుకు అనుగుణంగా తమ లక్ష్యాన్ని తీర్చగలవని తాము ధృడంగా విశ్వసిస్తున్నామని అన్నారు. తమ ఉత్పత్తులు వినియోగదారులు బైక్‌ లను నడిపే విధానాన్ని మారుస్తుందని మరియు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన విభాగంలో కొత్త విప్లవాలకు దారితీస్తుందని చెప్పారు.

భారతదేశపు మొట్టమొదటి హై-స్పీడ్ ఎలక్ట్రిక్ బైక్ నహక్ పి-14 బుకింగ్స్ ఓపెన్!

ఇదిలా ఉంటే, దేశీయ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ "నహక్ మోటార్స్" (Nahak Motors) భారతదేశపు మొట్టమొదటి హై-స్పీడ్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ అభివృద్ధి చేసింది. చూడటానికి అచ్చం పెట్రోల్ వెర్షన్ స్పోర్ట్స్ బైక్ మాదిరిగా కనిపించే "నహక్ పి-14" (Nahaq P-14) హై స్పీడ్ ఎలక్ట్రిక్ బైక్ ను కంపెనీ త్వరలోనే భారత మార్కెట్లో విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో నహక్ పి-14 ఇ-బైక్ కోసం కంపెనీ బుకింగ్‌లను కూడా ప్రారంభించింది. ఈ హైస్పీడ్ ఎలక్ట్రిక్ బైక్ గరిష్టంగా గంటకు 135 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోగలదు.

నహక్ పి-14 డెలివరీలు మే నెలలో ప్రారంభం కానున్నాయి. మార్కెట్లో పి-14 ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ బైక్ ధర రూ. 2.49 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉంటుంది. ఆసక్తిగల కస్టమర్లు కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో రూ. 11,000 టోకెన్ అడ్వాన్స్ చెల్లించి దీనిని బుక్ చేసుకోవచ్చు. గంటకు గరిష్టంగా 135 కిమీ వేగంతో ప్రయాణించే నహక్ పి-14, ఎలక్ట్రిక్ టూవీలర్ విభాగంలో గొప్ప టాప్ స్పీడ్ ను కలిగి ఉందనడంలో ఏమాత్రం సందేహం లేదు.

నహక్ పి-14 హై స్పీడ్ ఎలక్ట్రిక్ బైక్‌ లో లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ అమర్చబడి ఉంటుంది. ఈ బ్యాటరీని ఇంట్లోనే హోమ్ ప్లగ్ సాయంతోనే ఛార్జ్ చేసుకోవచ్చు. సాధారణ ఛార్జర్‌ ని ఉపయోగించి, ఈ బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ చేయడానికి దాదాపు 3 గంటల సమయం పడుతుంది. నహక్ పి-14 హై స్పీడ్ ఎలక్ట్రిక్ బైక్ ఫాస్ట్ ఛార్జింగ్ సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంటుంది. ఈ ఫాస్ట్ చార్జర్ సాయంతో ఈ హై స్పీడ్ ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీని కేవలం 30 నిమిషాల్లోనే పూర్తిగా ఛార్జ్ చేసుకోవచ్చు. ఈ బైక్‌లో 72v 60Ah లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. దాని రేంజ్ వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

India to get first electric hyper sports bike with top speed of 200 kmph from trouve motor