కార్తికేయ 2 రివ్యూ: శ్రీకృష్ణుడి కాలి కడియం కథను నమ్ముకున్న నిఖిల్ సీక్వెల్ సినిమా హిట్టవుతుందా?

కార్తికేయ 2 రివ్యూ: శ్రీకృష్ణుడి కాలి కడియం కథను నమ్ముకున్న నిఖిల్ సీక్వెల్ సినిమా హిట్టవుతుందా?

కార్తికేయ 2 లోని డైలాగ్ ఇది. చాలా చిన్న మాటే. కానీ లోతైన మాట‌. నిగూఢ‌మైన భావాలున్న మాట‌.

కృష్ణుడు, రాముడు, జీసస్‌, అల్లా.. వీళ్లంతా మామూలు మ‌నుషులుగానే తిరిగార‌ని కొంత‌మంది చ‌రిత్ర‌కారులు అంటారు. కానీ వాళ్ల‌ని మ‌నం దేవుళ్లుగా కొలుస్తాం. దానికి కార‌ణం.. వాళ్ల జీవన విధానం. త‌మ విజ్ఞానాన్ని త‌మ కోసం కాకుండా.. స‌మాజం కోసం వాడారని, అందుకే దేవుళ్ల‌య్యారని ప్రసిద్ధి. అది తెలుసుకోక మ‌తాలు - కులాలు అంటూ జ‌నాలు గొడ‌వ‌లు ప‌డుతుంటారు. ఈ సృష్టిలో చాలా ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఉండ‌దు. అంత మాత్రాన ప్ర‌శ్న త‌ప్ప‌ని కాదు. సైన్స్ లో కూడా అంతే. కొన్నింటికి సైన్స్ నుంచి కూడా జ‌వాబు రాదు. అలాంటి ప్ర‌శ్న‌లు హిందూ ధ‌ర్మ శాస్త్రంలో చాలా ఉన్నాయి. వాటిలో కొన్ని ప్ర‌శ్న‌లు సంధించుకొని, వాటికి స‌మాధానం వెదుక్కొంటూ చేసే ప్ర‌యాణం 'కార్తికేయ 2'.

నిఖిల్ - చందూ మొండేటి కాంబోలో వ‌చ్చిన కార్తికేయ మంచి విజ‌యాన్ని అందుకొంది. ప్ర‌తీ ప్ర‌శ్న‌కూ లాజిక‌ల్ గా స‌మాధానం వెదికే యువ‌కుడిగా కార్తికేయ‌లో నిఖిల్ న‌టించాడు. అత‌నికి ఇప్పుడు మ‌రో ప్ర‌శ్న ఎదురైంది. మ‌రి ఈ సారి ఈ ప్ర‌శ్న‌కు స‌మాధానం దొరికిందా? లేదా.. తానే స‌మాధానంగా నిలిచాడా? అనేది కార్తికేయ 2లో చూడొచ్చు.

క‌థ‌గా చెప్పాలంటే.. కార్తికేయ (నిఖిల్‌) ఓ డాక్ట‌ర్‌. ఈ సృష్టిలో ప్ర‌తీ దానికీ ఓ లాజిక్ ఉంద‌ని న‌మ్మే వ్య‌క్తి. త‌న ద‌గ్గ‌ర‌కు ఓ ప్ర‌శ్న వ‌స్తే - స‌మాధానం రాబ‌ట్ట‌కుండా ఉండ‌దు. ఐదేళ్ల నాటి మొక్కు తీర్చుకోవ‌డానికి అమ్మ (తుల‌సి)తో స‌హా... ద్వార‌క వెళ్తాడు. అక్క‌డ‌కు వెళ్లాక‌.. అనూహ్యంగా అమ్మ క‌నిపించ‌కుండా పోతుంది. త‌న‌పై ఎటాక్ జ‌రుగుతుంది. పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఎవ‌రో చంపడానికి త‌రుముకొస్తుంటారు. ముగ్థ (అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్) అనే అమ్మాయి కార్తికేయ‌ని కాపాడాల‌ని చూస్తుంది. ఇవ‌న్నీ ఎందుకు జ‌రుగుతున్నాయి? ఎప్పుటిదో ద్వాప‌రయుగం నాటి శ్రీ‌కృష్ఱుడి ఆభ‌ర‌ణాలకూ ఇప్ప‌టి క‌థ‌కూ ఉన్న సంబంధం ఏమిటి? ఇవ‌న్నీ కార్తికేయ 2 చూసి తెలుసుకోవాల్సిన విష‌యాలు.

హిందూ పురాణాలు తిర‌గేస్తే ఎన్నో పాత్ర‌లు. లెక్క‌లేన‌న్ని ఆశ్చ‌ర్యాలు క‌నిపిస్తాయి. వాటి చుట్టూ ఎన్నో ప్ర‌శ్న‌లు, క‌థ‌లు. అవి సినిమాల‌కూ ఉప‌యోగ‌ప‌డ‌తాయి. చాలామంది ద‌ర్శ‌కులు ఇతిహాసాల్లోని పాయింట్లతో సినిమాలు తీసి మెప్పించారు. కార్తికేయ 2 కూడా అలాంటి క‌థే. ద్వార‌క అనే మ‌హా న‌గ‌రం నీటిలో మునిగిపోయింద‌ని హిందూ పురాణాలు చెప్పాయి. శాస్త్ర‌వేత్త‌లు, ఆర్కియాల‌జీ డిపార్ట్‌మెంట్‌ ఇది నిజ‌మే అంటారు. మునిగిన ద్వార‌క‌లో ఎన్నో మ‌ర్మాలు దాగున్నాయి. ద్వార‌క చుట్టూ ఎన్నో ప్ర‌శ్న‌లు మిగిలి ఉన్నాయి. అందులో ఓ ప్ర‌శ్న‌... శ్రీ‌కృష్ణుడి కాలి క‌డియం. క‌లియుగంలో ఈ సృష్టి నాశ‌న‌మైపోతుంద‌ని, దానికి విరుగుడు శ్రీ‌కృష్ణుడి కాలి క‌డియంలో ఉంద‌ని న‌మ్మితే.. దాని కోసం హీరో రంగంలోకి దిగితే, ఎలా ఉంటుంద‌న్న‌ది క‌థ‌.

మామూలుగా చెప్పాలంటే నిధి అన్వేష‌ణ లాంటి క‌థ ఇది. దానికి ఇతిహాసాన్ని జోడించాడు ద‌ర్శ‌కుడు. హిందూ ధ‌ర్మాన్ని, అందులో న‌మ్మాల్సినవే అంటూ కొన్ని విషయాల్ని కొన్ని స‌న్నివేశాల్లో చాలా గట్టిగా చెప్పాడు. అందుకే.. `కార్తికేయ‌ 2`తో ప్రేక్ష‌కులు క‌నెక్ట్ అవుతారు. ఓర‌కంగా శ్రీ‌కృష్ణుడ్ని ఎలా అర్థం చేసుకోవాలి? అనే ప్ర‌శ్న‌కు ఈ సినిమాలో సమాధానం దొరుకుతుంది. అనుప‌మ్ ఖేర్ చెప్పే సంభాష‌ణ‌లు శ్రీ‌కృష్ణుడ్ని దేవుడ‌ని ఎందుకు న‌మ్మాలి? అనే విష‌యాన్ని బ‌లంగా చెబుతాయి. శ్రీ‌కృష్ణుడ్ని ఓ త‌త్వ‌వేత్త‌గా, శాస్త్ర‌వేత్త‌గా, విద్యావేత్త‌గా, సంగీత‌కారుడిగా, ఇంజ‌నీర్ గా మ‌న ముందు ఉంచుతాయి. మ‌నం దేవుళ్ల‌మ‌ని న‌మ్మే ప్ర‌తీ వ్య‌క్తిలోనూ ఈ ల‌క్ష‌ణాలు త‌ప్ప‌కుండా ఉంటాయ‌ని.. విడ‌మ‌ర‌చి చెబుతాయి. ఈ క‌థ‌కు అదే పునాది కావొచ్చు.

తొలి స‌న్నివేశాల్లో క‌థానాయ‌కుడి పాత్ర‌ని, త‌న ఆలోచ‌నా విధానాన్ని ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం చేశాడు ద‌ర్శ‌కుడు. ఇప్ప‌టికే కార్తికేయ - 1 చూసిన‌వాళ్ల‌కు హీరో పాత్ర గురించి కొంత అవ‌గాహ‌న ఉంటుంది. కాబ‌ట్టి.. తేలిగ్గానే క‌థ‌లోకి వెళ్లిపోతాడు ప్రేక్ష‌కుడు. హీరో ద్వార‌క‌లో అడుగుపెట్టాక‌.. కొత్త మ‌లుపులు, చిక్కులు ఎదుర‌వుతాయి. శ్రీ‌కృష్ణుడి క‌డియం గురించి అన్వేషించే ఓ సీక్రెట్ సొసైటీ.. అనుకోకుండా ఈ కార్యాన్ని నెత్తిమీద వేసుకొన్న కార్తికేయ‌, త‌న‌ని చంప‌డానికి వ‌స్తున్న అభీరుల ముఠా.. ఇలా ప్ర‌తీ చోటా.. ఓ లాక్ వేసుకుంటూ వెళ్లాడు ద‌ర్శ‌కుడు. దాంతో ప్ర‌తీ స‌న్నివేశం ఆస‌క్తిగా న‌డుస్తుంది. పాట‌లు లేక‌పోవ‌డం, రెగ్యుల‌ర్ రొమాంటిక్ సీన్ల‌కు చోటు ఇవ్వ‌క‌పోవ‌డం కార్తికేయ 2 లో క‌నిపించే మ‌రో ప్ల‌స్ పాయింట్‌. దాంతో తెర‌పై కేవ‌లం క‌థ మాత్ర‌మే న‌డుస్తుంది. విశ్రాంతి ఘ‌ట్టం వ‌చ్చేస‌రికి.. అస‌లు క‌థ‌లోకి ప్ర‌వేశిస్తాడు ప్రేక్ష‌కుడు.

అక్క‌డ్నుంచి క‌థంతా నిధి అన్వేష‌ణ లా... సాగుతుంది. ఓ క్లూ సంపాదించ‌డం, దాని ద్వారా మ‌రో క్లూ... ఇలా ఓ పజిల్ లా సినిమా సాగుతుంది. అయితే ఈ క‌థ‌లో ఓ ప్ర‌ధాన లోపం ఉంది. ఆ క‌డియం దొర‌క్క‌పోతే, ఈ సృష్టికి వ‌చ్చే విప‌త్తు ఏమిటో స‌రిగా వివ‌రించ‌లేదు. హీరోకి టార్గెట్ టైమ్ అంటూ ఏదీ లేదు. అస‌లు సీక్రెట్ సొసైటీ అంటే ఏమిటి? అది ఎందుకోసం ప‌ని చేస్తుంది? ఆ క‌డియం దొరికితే వాళ్ల‌కొచ్చే లాభాలేంటి? ఇవి కూడా మిస్ట‌రీగానే అనిపిస్తాయి. ఆ క‌డియం ద్వారా ఈ ప్ర‌పంచాన్ని ఎలా కాపాడొచ్చో కూడా అర్థం కాదు. ప్రారంభ స‌న్నివేశాలు కాస్త గంద‌ర‌గోళంగా అనిపిస్తాయి. ఆ క‌థ‌ని అర్థం చేసుకోవ‌డానికి కొంత టైమ్ ప‌డుతుంది. చంద‌మామ క‌థ‌లాంటి సినిమా ఇది. దాన్ని చిన్న‌పిల్ల‌ల‌కు సైతం అర్థ‌మ‌య్యేలా చెప్పాలి. లేదంటే.. ఈ గంద‌రోళంలో ప్రేక్ష‌కుడు అస‌లు క‌థ‌ని ఫాలో అవ్వ‌ని ప్ర‌మాదం ఉంది. శ్రీ‌కృష్ణుడి అభ‌రణాల్ని అన్వేషించే క్ర‌మంలో హీరోకి ఎదుర‌య్యే స‌వాళ్లు, వాటిని హీరో దాటుకొని రావ‌డం బాగానే ఉన్నా, ఇంకాస్త థ్రిల్లింగ్ గా వాటిని తీర్చిదిద్దితే బాగుండేది. హిందూ శాస్త్రాలు, వాటి గొప్ప‌ద‌నం, వేల సంవ‌త్స‌రాల క్రిత‌మే అడ్వాన్స్డ్ గా ఆలోచించారు అని చెప్ప‌డం బాగుంది. ఈ త‌రానికి హిందూ సంస్క్రృతి, సంప్ర‌దాయాలు, పురాణాల విశిష్ట‌త ఈ రూపంలో తెలియ‌జేసే ప్రయత్నం చేశారు.

నిఖిల్ లో సిన్సియారిటీ బాగా న‌చ్చుతుంది. త‌న శ‌క్తిమేర క‌ష్ట‌ప‌డ్డాడు. క‌థ‌కు ఏం కావాలో అదే చేశాడు. హీరో ఇంట్ర‌డ‌క్ష‌న్ పాట‌, పంచ్ డైలాగులూ అంటూ తాప‌త్ర‌య‌ప‌డ‌లేదు. కొన్ని చోట్ల త‌గ్గాల్సివ‌చ్చిన‌ప్పుడు త‌గ్గాడు. అనుప‌మ పాత్ర కూడా క‌థ‌లోంచి వ‌చ్చిన‌దే. ప్ర‌త్యేకంగా హీరో - హీరోయిన్ల మ‌ధ్య ల‌వ్ ట్రాక్ అంటూ లేదు. అలాంటివి జోడించి ఉంటే, అస‌లు క‌థ సైడ్ ట్రాక్ ప‌ట్టేది. శ్రీ‌నివాస్ రెడ్డి, స‌త్య కాస్తో కూస్తో కామెడీ చేయ‌డానికి ప్ర‌య‌త్నించారు. ఆదిత్య మీన‌న్ పాత్ర గంభీరంగా ఉన్నా.. ఎందుకో.. చివ‌ర్లో బాగా తేలిపోయిన‌ట్టు అనిపించింది. అనుప‌మ్ ఖేర్ ది చాలా చిన్న పాత్ర‌. ఒకే ఒక్క సీన్ కి ప‌రిమితం చేశారు. ఆ సీన్ లేక‌పోయినా క‌థ‌కు వ‌చ్చే న‌ష్టం లేదు.కాక‌పోతే.. అస‌లైన శ్రీ‌కృష్ణ తత్వం చెప్ప‌డానికి, అది త్వ‌ర‌గా ప్రేక్షకుల‌కు చేర‌డానికి ఈ స‌న్నివేశంతో పాటుగా, అనుప‌మ్ బాగా ఉప‌యోగ‌ప‌డ్డారు.

సాంకేతికంగా ఈ సినిమా ఉన్న‌తంగా ఉంది. బ‌డ్జెట్ ప‌రిమితులు లేక‌పోవ‌డం బాగా క‌లిసొచ్చింది. ద్వారక చ‌రిత్ర‌ని యానిమేష‌న్ రూపంలో తెర‌కెక్కించ‌డం బాగుంది. విజువ‌ల్ ప‌రంగా కొత్త లొకేషన్లు చూడొచ్చు. గ్రాఫిక్స్ కూడా కూల్ గా ఉన్నాయి. ముఖ్యంగా కాలభైరవ త‌న నేప‌థ్య సంగీతంతో ఈ క‌థ‌కు ప్రాణం పోశాడు. చాలా సన్నివేశాల్ని కాలభైరవ ఇచ్చిన నేప‌థ్య సంగీతం.. మ‌రో స్థాయిలో నిల‌బెట్టింది. కార్తిక్ ఘ‌ట్ట‌మ‌నేని కెమెరా ప‌నిత‌నం ఆక‌ట్టుకుంటుంది. ఎడిటింగ్ చాలా షార్ప్ గా ఉంది. తొలి స‌గం గంట‌లోనే ముగిసిపోతుంది. ఇలాంటి సినిమాల‌కు ఇంత స్పీడ్ క‌ట్ చాలా అవ‌స‌రం. సంభాష‌ణ‌ల్లో లాజిక్ ఉండేలా చూసుకొన్నారు. న‌మ్మ‌కానికీ, భ‌క్తికీ, మూడ విశ్వాసాల‌కూ, సైన్స్‌కీ ముడి పెడుతూ చెప్పే సంభాష‌ణ‌లు ఆక‌ట్టుకొన్నాయి. కార్తికేయ క‌థ ఇక్క‌డితో ఆగిపోలేదు. పార్ట్ 3 కూడా ఉంది. ఈసారి.. మునిగిపోయిన ద్వార‌క‌లో ఉన్న ర‌హ‌స్యాల్ని నిఖిల్ ఛేధించ‌బోతున్నాడు. దానికి సంబంధించిన హింట్... ప‌తాక స‌న్నివేశాల్లో ఇచ్చాడు ద‌ర్శ‌కుడు.

సీక్వెల్ సినిమాతో హిట్టు కొట్ట‌డం తెలుగులో చాలా అరుదుగా జ‌రిగే విష‌యం. అయితే... కార్తికేయ 2 ఆ ఫీట్ సాధించినట్టే కనిపిస్తోంది. ఓ ట్రెజ‌ర్ హంట్ క‌థ‌ని, ఇండియ‌న్ మైథాల‌జీతో ముడిపెడితే.. ఎలా ఉంటుంద‌న్న‌దానికి స‌మాధానం కార్తికేయ 2. ఈ సినిమా ఫ‌లితంతో పురాణాలు, అందులో ఉన్న ఆశ్చ‌ర్యాలు మ‌రిన్ని సినిమాల‌కు బీజం పోస్తాయ‌డంలో సందేహం లేదు.