సైన్స్‌ డే సైతం అమృతమయం!

సీవీ రామన్‌ 1888 జనవరి 7న జన్మించారు. అయితే నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ కమ్యూనికేషన్‌ (ఎన్సీఎస్టీసీ) ఆయన పుట్టిన రోజును కాకుండా, రామన్‌ ఎఫెక్ట్‌ను కనిపెట్టిన రోజును ‘నేషనల్‌ సైన్స్‌ డే’గా స్వీకరించడంతో ఫిబ్రవరి 28 ‘భారత జాతీయ సైన్స్‌’ దినోత్సవం అయింది. 

అమృత మహోత్సవాల నేపథ్యంలో వచ్చిన సైన్స్‌ డే కనుక 1947 నుంచి ఈ ఏడున్నర దశాబ్దాల కాలంలో శాస్త్ర సాంకేతిక రంగాలలో సాధించిన విజయాలను వేడుకగా జరుపుకోవడం సందర్భోచితమే అయినప్పటికీ... సైన్స్‌ వేడుకలకు ‘విజ్ఞాన్‌ సర్వత్ర పూజ్యతే’ అనే సంస్కృత తగిలింపును ఇవ్వడం సమంజ మేనా అనే ప్రశ్న వస్తుంది. ఈ తగిలింపు వల్ల శాస్త్ర సాంకేతిక కృషి స్వదేశీ సంప్రదాయాల్లోని ఒక భాగం అయిందే తప్ప, ప్రత్యేకంగా ఒక భాగం అయినట్లనిపించడం లేదు. ‘విజ్ఞాన్‌ సర్వత్ర పూజ్యతే’ అంటే ‘విజ్ఞానం అన్నిచోట్లా గౌరవం పొందుతుంది’ అని. ఈ మాట, ‘విద్వాన్‌ సర్వత్ర పూజ్యతే’ అనే సంస్కృత శ్లోకభాగానికి అనుకరణ. ఆ శ్లోకంలోని విద్వాన్‌ అనే మాట స్థానంలో విజ్ఞాన్‌ అనే మాటను పెట్టి సైన్స్‌ డేకి ఉప శీర్షికగా తగిలించిన కారణంగా సైన్స్‌కు సంస్కృతి రంగును వేసినట్లయింది. 

డెబ్బై ఐదేళ్ల స్వాతంత్య్ర అమృత మహోత్సవాలకు ఒక గుర్తింపు ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రతి దాన్నీ 75తో బ్రాండింగ్‌ చేస్తోంది. 75 కార్యక్రమాలు, 75 పోస్టర్లు, 75 చిత్రాలు... ఇలా! ఆఖరికి సైన్స్‌ డేని కూడా ‘అమృత’మయం చేయడంతో ఆ రోజును ఎందుకైతే ఉద్దేశించారో ఆ ఉద్దేశాన్ని తక్కువ చేసినట్లుగా అయింది. సైన్స్‌కి ప్రజాదరణ కల్పించడం అన్నది భారత్‌ సాధిం చిన శాస్త్ర పురోగతి, విజయాలు, మైలురాళ్లు... వీటికే పరిమితం అవకూడదు. శాస్త్రీయ విధానాలను ప్రజల నిత్యజీవితంలో భాగం చేయడం, ప్రజల్లోని మూఢనమ్మకాలను, అపోహలను తొలగిం చడం వంటి ప్రయత్నాలు కూడా ముఖ్యమైనవే. ప్రభుత్వేతర సంస్థలు, పౌర సమాజాల భాగస్వామ్యంతో ఈ పని చేయవచ్చు. భోపాల్‌ గ్యాస్‌ దుర్ఘటన తర్వాత ప్రజల్లో విషవాయువుల పట్ల జాగరూకత కల్పించి, వారిలో చైతన్యం తెచ్చేందుకు ఎన్సీఎస్టీసీ... తన ఆవిర్భావ సంవత్సరాలలో ఉండి కూడా... ‘ఆలిండియా పీపుల్స్‌ సైన్స్‌ మూవ్‌మెంట్‌’ అనే ఛత్రం కిందికి స్వచ్ఛంద సేవా సమూహాలన్నీ వచ్చేందుకు ఒక ఉత్ప్రేరకంగా పని చేయ గలిగింది! అదే సమయంలో ‘కేరళ శాస్త్ర, సాహిత్య పరిషత్‌’ తన జాతీయ సాక్షరతా మిషన్‌తో దేశవ్యాప్తంగా, భారత జన విజ్ఞాన యాత్రలు జరిపి, ప్రజల్ని మేల్కొలిపే ఒక మహా యజ్ఞాన్ని ప్రారంభించింది. 

సైన్స్‌ని ప్రజలకు చేరువగా తీసుకెళ్లేందుకు తొలిసారిగా ఎన్సీఎస్టీసీ దేశంలోని ప్రభుత్వ, పాక్షిక–ప్రభుత్వ, స్వచ్ఛంద సంస్థలను కలుపుకొంటూ ఒక యంత్రాంగాన్ని సంస్థాగత పరి చింది. ఎన్సీఎస్టీసీ సహకారంతో శాస్త్రబృందాలు గ్రామాల్లో పర్యటించి దొంగ స్వాముల అసలు స్వరూపాలను, వారి మాయ మాటల్ని బట్టబయలు చేశాయి. అలాగే సూర్యగ్రహణంతో లంకె ఉన్న అనేక మూఢ నమ్మకాలను పటాపంచలు చేయగలిగాయి. విచిత్రం ఏమిటంటే, సైన్స్‌ను ప్రోత్సహించాలనీ, ప్రజల్లోకి తీసు కెళ్లాలనీ, సమాజంతో అనుసంధానం చేయాలనీ ప్రవచించే ప్రభుత్వ సంస్థలు ఇలాంటి జాగృతి కార్యక్రమాలకు మద్దతు ఇవ్వకపోవడం, స్వచ్ఛంద సంస్థలను కలుపుకొని వెళ్లకపోవడం! 

దేశంలోని సైన్స్, టెక్నాలజీ సంస్థలు... సైన్సుకు ప్రజల్లో ఆదరణ కల్పించేందుకు తమ పాత్రపై పునరాలోచన చేసుకోవాలి. జాతీయ ప్రయోగశాలలు, విశ్వ విద్యాలయాలు, ఐఐటీలు ప్రజ లకు సహాయకారిగా ఉండే వనరుల కేంద్రాలు అవాలి. శాస్త్రీయ సంస్థలు తమ నైపుణ్యాలు, ప్రసంగాలతో తమ చుట్టూ ఉన్న ప్రజల్లో సామాజిక చైతన్యం తెచ్చేందుకు కృషి చేయాలి. ఉదా: ఉన్నత విద్యాసంస్థల్లోని శాస్త్రవేత్తలు, సైన్స్‌లో సీనియర్‌ విద్యా ర్థులు... విద్యా సంస్థలకు వెళ్లి సైన్స్‌ బోధన మెరుగయ్యేందుకు సహాయపడవచ్చు. పిల్లలు పాఠశాల స్థాయిలోనే సైన్స్‌ రంగంపై ఆసక్తి ఏర్పడేందుకు ఈ ‘సహాయక చర్యలు’ తోడ్పడతాయి. బయటి నుంచి వచ్చిన వాళ్లంటే పిల్లలూ ఉత్సాహంగా వింటారు. 

వాతావరణ మార్పులు, ఇంధనం, ఆహార భద్రత, జల సంరక్షణ, రీసైక్లింగ్, ఇ–వ్యర్థాలు, వన్య ప్రాణుల రక్షణ వంటి శాస్త్ర, సాంకేతిక అంశాలపై ప్రజల ప్రత్యక్ష భాగస్వామ్యం ఎప్పుడూ అవసరమే. అందుకు వారిని సైన్స్‌ సన్నద్ధం చేస్తుం డాలి. ప్రభుత్వం కూడా ఆర్భాటపు పథకాలు, ప్రణాళికలపై డబ్బును వృ«థా చేయకుండా సైన్స్‌ అభివృద్ధి రంగంలో ఉన్న సంస్థలకు ఆర్థిక వనరులను సమృద్ధిగా సమకూర్చాలి. అప్పుడే సైన్స్‌ వర్ధిల్లుతుంది. సైన్స్‌ డే ఉద్దేశం నెరవేరుతుంది.