ఆహ్లాదానికి చిరునామా

హైదరాబాద్‌, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ): హరితహారం కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన నగరాలతోపాటు జిల్లా కేంద్రాలు, పట్టణాల్లో ఏర్పాటు చేసిన అర్బన్‌ పార్కులు ప్రకృతి నిలయాలుగా మారాయి. ఆహ్లాదకరమైన వాతావరణం కోసం చూస్తున్న ప్రజలకు ఉత్తమ గమ్యస్థానాలుగా నిలుస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఒక్కో పార్క్‌ను ఒక్కో థీమ్‌తో రూపొందించిన అటవీశాఖ.. వాటిలో వాకింగ్‌, ట్రెక్కింగ్‌, సైక్లింగ్‌కు సదుపాయాలను ఏర్పాటు చేసింది. దీంతో పట్టణాల్లోని ఎంతో మంది పౌరులు, చిన్నారులు సాయంత్రం వేళల్లో ఉల్లాసంగా గడిపేందుకు అర్బన్‌ పార్కులను సందర్శిస్తున్నారు. సెలవు రోజుల్లో వీరి సంఖ్య విపరీతంగా పెరుగుతున్నట్టు అటవీశాఖ అధికారులు చెప్తున్నారు.

అర్బన్‌ పార్కుల్లోని సౌకర్యాలను ప్రజలు సద్వినియోగం చేసుకొనేందుకు వీలుగా అటవీశాఖ ప్రత్యేక యాప్‌ను రూపొందించింది. హెచ్‌ఎండీఏ, మేడ్చల్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌ పరిధిలో ఉన్న 39 అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కుల సమాచారాన్ని ఈ యాప్‌లో పొందుపరిచారు. త్వరలో మిగిలిన అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కుల సమాచారాన్ని అందుబాటులోకి తేనున్నారు. కాగా, అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కుల అభివృద్ధిని వరల్డ్‌ ఫారెస్ట్‌ సైన్స్‌ కూడా గుర్తించింది.