ఈరోజే IND vs SA 3rd T20.. టీమిండియాకి చావోరేవో పోరు!

దక్షిణాఫ్రికా చేతిలో వరుసగా రెండు టీ20ల్లో ఓడిపోయిన భారత్ జట్టు.. ఈరోజు విశాఖపట్నం వేదికగా చావోరేవో పోరుకి సిద్ధమైంది. గత గురువారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన తొలి టీ20లో 7 వికెట్ల తేడాతో సఫారీల చేతిలో పరాజయాన్ని చవిచూసిన టీమిండియా.. ఆదివారం రాత్రి కటక్‌‌లో జరిగిన రెండో టీ20లోనూ 4 వికెట్ల తేడాతో ఓడిపోయింది. దాంతో.. ఐదు టీ20ల సిరీస్‌లో ప్రస్తుతం 0-2తో భారత్ జట్టు వెనకబడి ఉండగా.. ఈరోజు మ్యాచ్‌లో ఓడితే సిరీస్‌ చేజారనుంది. ఈ నేపథ్యంలో.. వైజాగ్‌లో సత్తాచాటి సిరీస్‌ ఆశలు నిలుపుకోవాలని టీమిండియా ఆశిస్తోంది.

తొలి టీ20లో 211 పరుగులు చేసిన భారత్ జట్టు.. రెండో టీ20లో అనూహ్యంగా 148 పరుగులకే పరిమితమైంది. ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ టాస్ ఓడిన టీమిండియా ఫస్ట్ బ్యాటింగ్ చేయగా.. లక్ష్యాన్ని అలవోకగా దక్షిణాఫ్రికా టీమ్ ఛేదించేసింది. ఇక ఈరోజు మ్యాచ్‌కి ఆతిథ్యం ఇవ్వబోతున్న వైజాగ్‌లోనూ గత కొంతకాలంగా ఛేదనకు దిగిన జట్టే విజయం సాధిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో.. భారత్ జట్టు ఈరోజు మ్యాచ్‌లో గెలవాలంటే ఫస్ట్ టాస్ గెలవాల్సి ఉంటుంది. ఒకవేళ టాస్ ఓడినా.. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ అత్యుత్తమ ప్రదర్శన కనబర్చగలిగితేనే? సఫారీలను ఓడించగలదు.

బ్యాటింగ్ ఆర్డర్‌లో ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, దినేశ్ కార్తీక్, హార్దిక్ పాండ్య మంచి టచ్‌లో కనిపిస్తున్నారు. కానీ.. బౌలింగ్‌లో మాత్రం భువనేశ్వర్ కుమార్ ఒక్కడే కాస్త ఫర్వాలేదనిపిస్తున్నాడు. మిగిలిన వారు తేలిపోతున్నారు. మరీ ముఖ్యంగా.. అక్షర్ పటేల్ ఆల్‌రౌండర్‌గా రెండు మ్యాచ్‌ల్లోనూ ఫెయిల్. హర్షల్ పటేల్, అవేష్ ఖాన్, చాహల్ కూడా అంచనాల్ని అందుకోలేకపోయారు. మొత్తంగా.. భారత్ జట్టు.. గత రెండు మ్యాచ్‌ల్లోనూ సమష్టిగా రాణించడంలో విఫలమైంది. కెప్టెన్‌గా రిషబ్ పంత్ నిర్ణయాలు కూడా మంచి ఫలితాల్ని ఇవ్వడం లేదు.