Rohit Sharma వరల్డ్ రికార్డ్.. టీ20ల్లో ఈ ఘనత సాధించిన ఫస్ట్ కెప్టెన్

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) టీ20ల్లో వరల్డ్ రికార్డ్ నెలకొల్పాడు. ఇంగ్లాండ్‌తో సౌథాంప్టన్ వేదికగా గురువారం అర్ధరాత్రి ముగిసిన తొలి టీ20 మ్యాచ్‌లో 50 పరుగుల తేడాతో విజయం సాధించిన భారత్ జట్టు.. మూడు టీ20ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. కరోనా కారణంగా ఇటీవల ఇంగ్లాండ్‌తో ముగిసిన ఆఖరి టెస్టుకి దూరమైన రోహిత్ శర్మ.. రీఎంట్రీలోనే అదరగొట్టేశాడు. బ్యాటర్‌గానే కాదు.. కెప్టెన్‌గా కూడా హిట్‌మ్యాన్‌ని మంచి మార్కులు పడ్డాయి.

మ్యాచ్‌లో ఓపెనర్‌గా ఆడిన రోహిత్ శర్మ కేవలం 14 బంతుల్లోనే 5x4 సాయంతో 24 పరుగులు చేసి భారత్ జట్టుకి మెరుపు ఆరంభాన్నిచ్చాడు. స్పిన్నర్ మొయిన్ అలీ బౌలింగ్‌లో వరుసగా స్వీప్ షాట్లు ఆడి ఫోర్లు బాదిన రోహిత్.. అదే క్రమంలో కీపర్ జోస్ బట్లర్‌కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆఖరికి భారత్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేయగా.. లక్ష్యఛేదనలో ఇంగ్లాండ్ టీమ్ 19.3 ఓవర్లలో 148 పరుగులకే ఆలౌటైంది. ఇక రెండో టీ20 మ్యాచ్ బర్మింగ్‌హామ్ వేదికగా శనివారం రాత్రి 7 గంటలకి జరగనుంది.

సౌథాంప్టన్ టీ20లో భారత్ జట్టు విజయం సాధించగా.. కెప్టెన్‌గా రోహిత్ శర్మ అరుదైన రికార్డ్‌ని సొంతం చేసుకున్నాడు. భారత్ జట్టుకి ఇప్పటి వరకూ 13 టీ20ల్లో రోహిత్ శర్మ సారథ్యం వహించగా.. అన్ని మ్యాచ్‌ల్లోనూ టీమిండియా విజయం సాధించింది. టీ20 క్రికెట్ చరిత్రలో ఇలా వరుసగా 13 మ్యాచ్‌ల్లో జట్టుని గెలిపించిన తొలి కెప్టెన్‌గా హిట్‌మ్యాన్ నిలిచాడు.