నేడు జాతీయ సైన్స్‌ దినోత్సవం

నాగలి నుంచి హరిత విప్లవం దాకా, చక్రం నుంచి విమానం దాకా, నిప్పు నుంచి అణుబాంబు దాకా, నాటకాల నుంచి త్రీడి సినిమాల దాకా, బ్లాక్‌ అండ్‌ వైట్‌ టీవీల నుంచి ఎల్‌సీడీ, ఎల్‌ఈడీ దాకా, ఉత్తరాల మొదలుకొని సెల్‌ఫోన్‌, అంతర్జాలం వరకు ప్రపంచం అత్యున్నత దిశగా అడుగేసింది. నూతన వైజ్ఞానిక ఆవిష్కరణలతో మానవుడి జీవన పయనం సుఖమయంగా మారింది. మనిషి చంద్రలోకాన్ని జయించి ఇలను ఇంద్రలోకంగా మార్చి ప్రపంచాన్ని అరచేతిలో బంధించాడు. సాంకేతిక వైజ్ఞానిక రంగంలో ప్రగతి పథాన పురోగమిస్తూ మానవుడే మహనీయుడయ్యాడు. దీనికంతటికీ కారణం సైన్స్‌. ఎంతో మంది శాస్త్రవేత్తల కృషి ఫలితమే నేడు మనం అనుభవిస్తున్న విలాసావంతమైన జీవన పయనం. రాళ్ల రాపిడితో నిప్పును పుట్టించిన దశ నుంచి ఈనాటి రాకెట్‌ యుగం వరకు మార్పులన్నీ వైజ్ఞానిక రంగం విజయాల ఫలితమే. ప్రఖ్యాత భారతీయ శాస్త్రవేత్త సర్‌సీవీ రామన్‌ ‘ఎఫెక్ట్‌’ ఆవిష్కరించి నేటికి 92 వసంతాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ‘సైన్స్‌డే’ ను పురస్కరించుకుని‘నమస్తేతెలంగాణ’ అందిస్తున్న ప్రత్యేక కథనం.
– తాండూరు, ఫిబ్రవరి 27

సర్‌ చంద్రశేఖర్‌ వెంకట్‌రామన్‌ తమిళనాడులో 7 నవంబర్‌ 1888లో జన్మించాడు. ఈయన భౌతికశాస్త్రంలో 28 ఫిబ్రవరి 1928లో కాంతి ప్రసరణపై జరిపిన పరిశోధనలకు గాను, 1930లో రామన్‌ ఎఫెక్టుగా గుర్తించి నోబెల్‌ బహుమతిని ప్రదానం చేశారు. దీంతో ప్రపంచ దేశాలు భారత్‌పై ఒక్కసారిగా దృష్టి సారించాయి. దేశంలో యువ శాస్త్రవేత్తలు ఉన్నప్పటికీ పేదరికం, వెనుకబాటు తనం వల్ల కొందరు యువశాస్త్రవేత్తలు వెలుగులోకి రాలేకపోతున్నారు. భారత అణుపితామహుడిగా పేరొందిన దివంగత అబ్దుల్‌ కలాం నిరుపేద కుటుంబంలో పుట్టినా మొక్కవోని పట్టుదలతో ఎదిగి జాతి గర్వించదగ్గ శాస్త్రవేత్తగా ఖ్యాతి ఘడించారు. అబ్దుల్‌ కలాం తరచూ విద్యార్థులతో సంభాషించినప్పుడు కలలు కనడమే కాదు, వాటిని సాకారం చేయాలి అప్పుడే మనం అనుకున్నది సాధిస్తామని చెప్పేవారు.

సైన్స్‌ కారణంగా మానవుడు విలాసావంతమైన జీవితం ఆరంభించడం బాగానే ఉంది. విజ్ఞాన శాస్త్రం అనేక సమస్యలను పరిష్కరించడంలో మానవ జీవితాన్ని సుఖవంతం చేసింది. కాని, మనిషి విచక్షణ లోపం వల్ల ఆ విజ్ఞానమే పరిసరాల కాలుష్యం, పర్యావరణ అసమౌతులత్యకు దారి తీస్తున్నది. అణువస్త్రం అనే మారణాయుధాయులను సృష్టించడంతో మానవులతో పాటు జీవరాసుల మనుగడే ప్రశ్నార్థకంగా మారుతున్నది. సైన్స్‌తోనే అణుబాంబులను తయారు చేసి జనం ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఈ బాంబులను సైన్స్‌ పరిజ్ఞానంతోనే తయారు చేశారు. మానవుడిలో విచక్షణ లోపించి ఇలా మారణహోమాలను సృష్టించడం మేధావులతో సామాన్యులు కూడా తప్పుపడుతున్నారు. మానవుడు తన విజ్ఞానాన్ని సరైన మార్గంలో వినియోగించి సృష్టి ఔనత్యానికి పాటుపడాలే కాని, సృష్టి వినాశనానికి సైన్స్‌ను ఉపయోగించకూడదు. సైన్స్‌ డే సందర్భంగా ఈ విషయమై ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.

విద్యార్థుల్లో దాగిన ప్రతిభను వెలికితీసేందుకు పాఠశాల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వం సైన్స్‌ ప్రదర్శనలు నిర్వహించడంతో విద్యార్థులు ప్రేరేపితమై పలు సైన్స్‌ ప్రయోగాలతో పాటు నూతన ఆవిష్కరణలు చేస్తున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక సైన్స్‌ఫెయిర్‌ ప్రదర్శనలో పాల్గొన్న పాఠశాలలకు ప్రత్యేక నిధులు విడుదల చేయడంతో విద్యార్థులు, అధ్యాపకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలన్నింటికీ పాఠ్యాంశాల్లో ఉన్న వాటన్నింటికీ సైన్స్‌ పరికరాలను ఉపయోగించి పాఠాలు బోధించే విధంగా అధికారులు చొరవ తీసుకుని పాఠశాలల, కళాశాలల్లో సైన్స్‌ ల్యాబ్‌లు ఏర్పాటు చేసి అందులో అన్ని సైన్స్‌ పరికారాలు ఉండేలా చూడాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.