నేడు బిహార్‌ కేబినెట్‌ విస్తరణ.. ఆర్జేడీకి 16 మంత్రి పదవులు

పాట్నా : బిహార్‌లో జేడీయూ మహాకూటమితో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నితీశ్‌కుమార్‌ నేతృత్వంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం కొనసాగగా.. ముఖ్యమంత్రి ప్రభుత్వాన్ని రద్దు చేశారు. ఆ తర్వాత తేజస్వియాదవ్‌తో కలిసి నితీశ్‌ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈ నెల 10న ఎనిమిదోసారి నితీశ్‌కుమార్‌, డిప్యూటీ సీఎంగా తేజస్వి ప్రమాణస్వీకారం చేశారు.

తాజాగా మంగళవారం ఉదయం 11.30 గంటలకు కేబినెట్‌ను విస్తరించనున్నారు. బిహార్‌ అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా అవతరించిన ఆర్జేడీకి 16 మంత్రి పదవులు దక్కే అవకాశం ఉన్నది. జేడీ(యూ)కు 11, జీతన్‌రామ్‌ మాంఝీ నేతృత్వంలోని హిందుస్థానీ అవామ్‌ మోర్చా పార్టీకి ఒకటి, మహాకూటమిలో భాగమైన కాంగ్రెస్‌కు రెండు, మరో స్వతంత్ర ఎమ్మెల్యేకు సైతం మంత్రి దక్కనున్నది. మొత్తం 31 మందిని కేబినెట్‌లోకి తీసుకోనున్నట్లు తెలుస్తున్నది. జముయి జిల్లాలోని చకైకి చెందిన స్వతంత్ర ఎమ్మెల్యే సుమిత్‌కుమార్‌ సింగ్‌ నితీశ్‌ నేతృత్వంలోని మంత్రివర్గంలో ఇంతకు ముందు సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మంత్రిగా పని చేశారు.

ఆర్జేడీ నుంచి తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌, సురేంద్ర యాదవ్‌, శశి భూషణ్ సింగ్, భూదేవ్ చౌదరి, అనితా దేవి, కుమార్ సర్వజీత్, అలోక్ మెహతా, షానవాజ్ ఆలం, సుధాకర్ సింగ్, సమీర్ మహాసేత్.. కాంగ్రెస్‌ నుంచి షకీల్‌ అహ్మద్‌, రాజేశ్‌కుమార్‌ మంత్రి పదవులు ఆశిస్తున్నారు. అలాగే బిహార్‌ మాజీ సీఎం జీతన్‌రామ్‌ మాంఝీ పెద్దకొడుకు సంతోష్‌ సుమన్‌ మాంఝీకి సైతం మంత్రి పదవి దక్కే ఛాన్స్‌ ఉన్నది.