ఇంగ్లిష్‌ విద్యతోనే అభివృద్ధి సాధ్యం

రామచంద్రాపురం, ఆగస్టు15: ప్రపంచంలో అగ్రరాజ్యంగా ఎదుగాలంటే దేశంలోని అన్ని వర్గాల పిల్లలకు ఇంగ్లిష్‌ మీడియం విద్య అందాలని ఉస్మానియ రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ కంచె ఐలయ్య అన్నారు. సోమవారం తెల్లాపూర్‌లోని ఒక ప్రైవేటు ఎడ్యుకేషన్‌ సొసైటీ (ఆస్క్‌)లో ఉచిత శిక్షణ పొందిన డేటా సైన్స్‌ విద్యార్థుల ముగింపు వేడుక, స్వాతంత్య్ర వేడుకలకు కంచె ఐలయ్య, ప్రజా గాయకుడు గద్దర్‌ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కంచె ఐలయ్య మాట్లాడుతూ 75ఏండ్ల ఉద్యమంలో విద్యావ్యవస్థ కొంత వరకు మెరుగుపడిందని, వచ్చే 25 ఏండ్లల్లో ఇంకా మౌలికంగా మార్చాల్సిన అవసరం ఉందని అన్నారు. సంపన్నుల పిల్లలు మాత్రమే అందుతున్న ఇంగ్లిష్‌ను పేదలకు అందిస్తేనే అభివృద్ధిలో ముందుకు సాగగలమన్నారు.

మన ఊరు.. మనబడితో రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియాన్ని ప్రవేశపెట్టడం చాలా మంచి నిర్ణయమన్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 8లక్షల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చేరారన్నారు. ప్రతి బడ్జెట్‌లో రూ.10 వేల కోట్లు విద్యకు ఖర్చు పెట్టి ఇంగ్లిష్‌ మీడియం బోధనను పటిష్టపర్చాలని కోరారు. ఇంగ్లిష్‌ విద్యా బోధనకు బీజేపీ వ్యతిరేఖి అని, కాంగ్రెస్‌ కూడా ఈ విషయంలో మాట్లాడడం లేదని అన్నారు. ఆస్క్‌ ఎడ్యుకేషన్‌ సొసైటీలో కులమతాలకతీతంగా నిరు పేద కుటుంబానికి చెందిన విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు, మొదటి బ్యాచ్‌లో 40 మందికి శిక్షణ ఇవ్వగా 15మందికి ఉద్యోగ అవకాశాలు లభించాయని తెలిపారు.

అనంతరం ప్రజా గాయకుడు గద్దర్‌ మాట్లాడుతూ ఓటు వెలకట్టలేనిదని, తూటా కంటే బలమైనదని, ఓటును నోటుకు బలి చేయకుండా ప్రజలకు ఉపయోగపడే వ్యక్తిని ఎంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సీనియర్‌ జర్నలిస్ట్‌ పాశం యాదగిరి, ఆస్క్‌ సొసైటీ ఫౌండర్‌ కొల్లూరి సత్తయ్య, కౌన్సిలర్‌ భరత్‌కుమార్‌, కోఆర్డినేటర్‌ మణికంఠ, గీతారామస్వామి, మామిడాల ప్రవీణ్‌, డాక్టర్‌ బాలబోయిన, సుదర్శన్‌, కౌన్సిలర్‌, నాయకులు పాల్గొన్నారు.