స్పోర్ట్స్ అకాడమీని ప్రారంభించిన గబ్బర్.. ఏం పేరు పెట్టాడంటే..!

Shikhar Dhawan: టీమిండియా ఓపెనర్, రాబోయే జింబాబ్వే సిరీస్ లో   భారత జట్టుకు సారథిగా వ్యవహరిస్తున్న శిఖర్ ధావన్ స్పోర్ట్స్ అకాడమీని ప్రారంభించాడు. కేవలం క్రికెట్ ఒక్కటే కాదు.. మిగిలిన క్రీడల్లోనూ... 

ఇటీవలే  వెస్టిండీస్ తో ముగిసిన వన్డే సిరీస్ లో భారత జట్టుకు సారథిగా వ్యవహరించిన శిఖర్ ధావన్.. తన కలను నెరవేర్చుకున్నాడు. ఢిల్లీలో తాను ఎప్పట్నుంచో అనుకుంటున్న స్పోర్ట్స్ అకాడమీని ప్రారంభించాడు.  క్షేత్ర స్థాయిలో  క్రీడాకారుల్లో నైఫుణ్యాలను  కనుగొని వారిని మరింత రాటుదేల్చాలనే ధ్యేయంతో ధావన్ ఈ అకాడమీని నెలకొల్పాడు. 

ఢిల్లీలో ‘డా వన్ స్పోర్ట్స్’ పేరిట ధావన్  అకాడమీని   ఏర్పాటుచేశాడు.  క్రికెట్ తో పాటు దాదాపు 8 క్రీడాంశాల్లో క్రీడాకారులకు ఈ అకాడమీ శిక్షణ ఇవ్వనుందని ధావన్ తెలిపాడు. 
 

శుక్రవారం ‘డా వన్ స్పోర్ట్స్ అకాడమీ’ ప్రారంభోత్సవం సందర్భంగా ధావన్ మాట్లాడుతూ.. ‘మా అకాడమీలో క్షేత్ర స్థాయిలో క్రీడాకారులను గుర్తించి వారికి శిక్షణ ఇవ్వడం,  జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో రాణించేందుకు గాను వారిని సానబెడతాం..’ అని తెలిపాడు.  
 

క్రీడాకారులకే  గాక కోచ్ లకు కూడా తమ అకాడమీ లో శిక్షణ ఇప్పిస్తామని ధావన్ చెప్పాడు. ‘దేశవ్యాప్తంగా ఉత్తమ కోచ్ లను ఎంపిక చేసి డా వన్ స్పోర్ట్స్ అకాడమీలో  క్రీడాకారులకు శిక్షణ ఇప్పిస్తాం.  ఆటగాళ్లకే గాక కోచ్ లకూ శిక్షణ కార్యక్రమాలు ఉంటాయి.. క్రికెట్ నాకెంతో ఇచ్చింది. అందుకే నేను వీలైనంత వరకు భారత్ లో క్రీడలకు సాయం చేయాలని భావిస్తున్నా..’ అని ధావన్ చెప్పాడు. 

ఇక విండీస్ సిరీస్ ముగిసిన తర్వాత స్వదేశానికి చేరుకున్న శిఖర్ ధావన్.. త్వరలోనే జింబాబ్వే టూర్ కు వెళ్లనున్నాడు. ఆ పర్యటనలో యువ భారత జట్టుకు అతడే సారథ్యం వహించనున్నాడు. జింబాబ్వేతో భారత్ మూడు వన్డే (ఆగస్టు 18, 20, 22) లు ఆడనుంది.  విండీస్ పర్యటనలో కుర్రాళ్లతోనే పటిష్టమైన విండీస్ ను చిత్తు చేసిన ధావన్ అండ్ కో.. ఇప్పుడు జింబాబ్వే పైనా అదే ఫలితాన్ని రిపీట్  చేయాలని చూస్తున్నది. 
 

జింబాబ్వే పర్యటనకు భారత జట్టు : శిఖర్ ధావన్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శుభమన్ గిల్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, ఇషాన్ కిషన్, సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, అవేశ్ ఖాన్, ప్రసిధ్ కృష్ణ, మహ్మద్ సిరాజ్, దీపక్ చహర్