ధోనీ రిటైర్మెంట్‌కి రెండేళ్లు... రెండు రనౌట్ల మధ్య ఆ అవమానాన్ని మరిచిపోని మాహీ...

ధోనీ రిటైర్మెంట్‌కి రెండేళ్లు... రెండు రనౌట్ల మధ్య ఆ అవమానాన్ని మరిచిపోని మాహీ...

మహేంద్ర సింగ్ ధోనీ... భారత క్రికెట్ చరిత్రలో ఓ శకాన్ని తన పేరిట లిఖించుకున్న సారథి. అనుకోకుండా టీమిండియా కెప్టెన్సీ పగ్గాలు అందుకున్న వికెట్ కీపర్ ఎంఎస్ ధోనీ, 2007 టీ20 వరల్డ్ కప్ గెలవడంతో ఓవర్‌నైట్ సూపర్ స్టార్‌గా మారిపోయాడు... 2011 వన్డే వరల్డ్ కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ విజయాలతో టీమిండియాకి మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్‌గా మారిన మాహీ అంతర్జాతీయ రిటైర్మెంట్‌కి సరిగ్గా రెండేళ్లు...

రనౌట్‌తో అంతర్జాతీయ కెరీర్‌ని మొదలెట్టిన మహేంద్ర సింగ్ ధోనీ, రనౌట్‌తోనే కెరీర్‌కి ఫుల్‌స్టాప్ పెట్టాడు. 2019 వన్డే వరల్డ్ కప్ తర్వాత క్రికెట్‌కి దాదాపు 9 నెలల పాటు క్రికెట్‌కి దూరంగా ఉన్నాడు ఎంఎస్ ధోనీ...

ఐపీఎల్ 2020 సీజన్ కోసం యూఏఈ చేరుకున్న మాహీ, సీఎస్‌కే క్యాంపులో ఉన్న సమయంలోనే ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు సంచలన ప్రకటన చేశాడు. మాహీ క్రికెట్‌కి దూరంగా వస్తున్నప్పటి నుంచే అతని రిటైర్మెంట్‌పై ఊహాగానాలు వినిపించినా, ఫేర్‌వెల్ మ్యాచ్ కూడా లేకుండా ఇలా సడెన్‌ రిటైర్మెంట్ ఇస్తాడని మాత్రం ఎవ్వరూ అనుకోలేదు... 

తన రిటైర్మెంట్ పోస్టులో 2007 వన్డే వరల్డ్ కప్ సమయం నాటి సన్నివేశాలను హైలెట్ చేయడం చాలామంది దృష్టిని ప్రత్యేకంగా ఆకర్షించింది. 2004లో బంగ్లాదేశ్‌పై అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన మాహీ, తొలి మ్యాచ్‌లో పరుగులేమీ చేయకుండానే రనౌట్ అయ్యాడు ధోనీ...

అయితే విశాఖపట్నంలో జరిగిన తన ఐదో మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై 123 బంతుల్లో 148 పరుగులు చేసి గుర్తింపు తెచ్చుకున్నాడు మాహీ. జులపాల జుట్టుతో స్టైలిష్ లుక్‌లో కనిపించిన మాహీకి ఈ ఇన్నింగ్స్ తర్వాత బీభత్సమైన ఫాలోయింగ్ వచ్చేసింది...

ఆ తర్వాత కొన్ని మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌లతో మాహీ టీమిండియాలో సూపర్ స్టార్‌గా ఎదిగాడు. 2003 వన్డే వరల్డ్ కప్‌లో ఫైనల్ చేరిన టీమిండియా, 2007 వన్డే వరల్డ్ కప్‌లో టైటిల్ ఫెవరెట్ టీమ్స్‌లో ఒకటిగా బరిలో దిగింది. అయితే బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో చిత్తుగా ఓడి సూపర్ 12 రౌండ్‌కి కూడా అర్హత సాధించలేకపోయింది టీమిండియా...

ఈ పరాజయం టీమిండియా క్రికెట్ ఫ్యాన్స్‌లో ఆగ్రహ జ్వాలలను రాజేసింది. బంగ్లాతో మ్యాచ్‌ తర్వాత భారత క్రికెటర్ల దిష్టి బొమ్మలను దహనం చేసిన క్రికెట్ ఫ్యాన్స్, జార్ఖండ్‌లోని ధోనీ ఇంటిపై రాళ్ల దాడి చేశారు...

ఈ సంఘటన అప్పటి టీమిండియా క్రికెటర్లలో భయాందోళనలను సృష్టించింది. ఈ కారణంగానే అదే ఏడాది జరిగిన మొట్టమొదటి టీ20 వరల్డ్ కప్‌కి సీనియర్లు అందరూ దూరంగా ఉన్నారు. రాహుల్ ద్రావిడ్, వీవీఎస్ లక్ష్మణ్, సౌరవ్ గంగూలీ, సచిన్ టెండూల్కర్, అనిల్ కుంబ్లే, జహీర్ ఖాన్ వంటి సీనియర్లు దూరంగా ఉండడంతో అనుకోకుండా ధోనీకి కెప్టెన్సీ దక్కింది... ఇదే అతని కెరీర్‌ని మలుపు తిప్పింది...

టీమిండియా కెప్టెన్‌గా ఎన్ని విజయాలు అందుకున్నా, 2007 వన్డే వరల్డ్ కప్ సమయంలో ఎదుర్కొన్న అవమానాలను మాత్రం మరిచిపోలేదు మహేంద్రుడు. అందుకే తన రిటైర్మెంట్ వీడియోలో కూడా ఈ సన్నివేశాలనే హైలైట్ చేశాడు ధోనీ...

తన రిటైర్మెంట్ వీడియోకి ‘కభీ కభీ’ మూవీలోని ‘మై పల్ దో పల్ కా షాయర్’ అంటూ సాగే పాటను జోడించిన మహేంద్ర సింగ్ ధోనీ... తన క్రికెట్ ప్రయాణాన్ని పాటతో వర్ణించాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక వ్యూస్ సాధించిన వీడియోల్లో ఒకటిగా మాహీ రిటైర్మెంట్ వీడియో...

అంతేకాకుండా ఇండియన్ రైల్వేస్‌లో టికెట్ కలెక్టర్‌గా పనిచేసిన మహేంద్ర సింగ్ ధోనీ, తన రిటైర్మెంట్ సమయాన్ని కూడా 19:29గా ప్రకటించి.. తన ప్రయాణం ఎక్కడ మొదలైందో చెప్పకనే చెప్పాడు. 

అలాగే ధోనీ రిటైర్మెంట్ కోసం సరిగ్గా 19:29 సమయాన్ని ఎందుకు వాడడు? అనే దానిపై కూడా చాలా వాదనలు వినిపించాయి. అయితే 2019 వన్డే వరల్డ్ కప్ సెమీస్‌లో భారత జట్టు, న్యూజిలాండ్ చేతుల్లో ఓడింది. ఈ మ్యాచ్‌లో కూడా మాహీ రనౌట్ అయ్యాడు...

వర్షం కారణంగా రెండు రోజుల పాటు సాగిన సెమీ ఫైనల్ మ్యాచ్ సరిగ్గా రాత్రి 19:29 నిమిషాలకు ముగిసింది. దీంతో తన ఆఖరి మ్యాచ్ ముగిసిన సమయమే, తన అంతర్జాతీయ క్రికెట్ రిటైర్మెంట్‌ సమయంగా తీసుకున్నాడని విశ్లేషించారు కొందరు క్రికెట్ నిపుణులు...