చంద్రబాబు కోసం అంబరీష్ చాలా చేశారు, కృతజ్ఞతలేదు: మోహన్ బాబు ట్వీట్

చంద్రబాబు చేపట్టిన అనేక కార్యక్రమాలకు తన ద్వారా అంబరీష్ ను ఆహ్వానించేవారని గుర్తు చేశారు. చంద్రబాబుకు అంబరీష్ చాలా చేశారని చెప్పుకొచ్చారు. అలాంటి వ్యక్తి చనిపోతే అతని కుటుంబంపై సానుభూతి చూపించాల్సింది పోయి అతని భార్యను ఓడించడానికి ప్రయత్నిస్తున్నారంటూ మండిపడ్డారు. 
 

హైదరాబాద్‌ : కర్ణాటక రాష్ట్రం మాండ్యలో జరుగుతున్న ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి ప్రముఖ నటుడు అంబరీష్ సతీమణి, నటి సుమలతను గెలిపించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, సినీనటుడు మంచు మోహన్ బాబు కోరారు. సుమలతను భారీ మెజారిటీతో గెలిపించాలని ట్విట్టర్ వేదికగా మాండ్య ప్రజలను కోరారు మోహన్ బాబు. 

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుపై కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు ఒకప్పటి ఆంధ్రప్రదేశ్ సీఎం అని ప్రస్తుతం కాదన్నారు. అలాగే ఇక ఎప్పటికీ చంద్రబాబు సీఎం కాలేరని వ్యాఖ్యానించారు. అంబరీష్ చాలా మంచి వ్యక్తి అని ఆయన కొనియాడారు. 

చంద్రబాబు చేపట్టిన అనేక కార్యక్రమాలకు తన ద్వారా అంబరీష్ ను ఆహ్వానించేవారని గుర్తు చేశారు. చంద్రబాబుకు అంబరీష్ చాలా చేశారని చెప్పుకొచ్చారు. అలాంటి వ్యక్తి చనిపోతే అతని కుటుంబంపై సానుభూతి చూపించాల్సింది పోయి అతని భార్యను ఓడించడానికి ప్రయత్నిస్తున్నారంటూ మండిపడ్డారు. 

సుమలతకు వ్యతిరేకంగా చంద్రబాబు ప్రచారం చెయ్యడం దురదృష్టకరమన్నారు. కులం డబ్బు రాజకీయాలను పక్కనపెట్టి సుమలతను గెలిపించాలని మోహన్ బాబు మాండ్య ప్రజలను కోరారు. 

కర్ణాటక ప్రజలకు ముఖ్యంగా మాండ్య ప్రజలు, అభిమానులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. మన అభిమాన నటుడు, ప్రజల మనిషి, గొప్ప వ్యక్తిత్వం గల నటుడు అంబరీష్‌ అని, మాండ్యప్రజల సంక్షేమం కోసం నిరంతరం పరితపించిన వ్యక్తి అంటూ మోహన్ బాబు ప్రశంసించారు. 

రాష్ట్ర అభివృద్ధి కోసం అంబరీష్ చేసిన సేవ ప్రతీ ఒక్కరు గుర్తుకు తెచ్చుకోవాలని కోరారు. ప్రస్తుత సమయంలో ఆయన సతీమణి సుమలతకు అండగా ఉండాల్సిన కనీస బాధ్యత తనతోపాటు మాండ్య నియోజకవర్గ ప్రజలకు ఉందన్నారు. 

మాండ్య లోక్ సభ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన  సుమలతకు మీ అందరి ఆశీస్సులు ఉంటాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. సుమలతను భారీ మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. అంబరీష్‌తో పాటు నేను కూడా మిమ్మల్ని ప్రేమించాను. మండ్య ప్రజలు సహృదయం కలవారు. వారందరికి నా నమస్కారాలు అంటూ మోహన్ బాబు ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. 

To all the people of Kannada, especially Mandya people and fans... pic.twitter.com/E3jiTbjKax